ఆదాయం తగ్గినా లెక్కచేయం: మంత్రి అవంతి

20 Dec, 2019 13:06 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మద్య సేవనం మనిషిలో పశుత్వాన్ని నిద్రలేపుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. గాంధీసెంటర్, జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖ ద్వారకానగర్‌ గ్రంథాలయంలో శుక్రవారం మద్య విమోచన ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ మద్య విమోచన కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ‘మద్యం వద్దు.. కుటుంబం ముద్దు పోస్టర్‌’ను ఈ సందర్భంగా మంత్రి అవంతి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా లెక్క చేసేది లేదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సృష్టం చేశారు.

మద్యపాన నిషేధానికి అంతా సహకరించాలి..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎన్‌ శర్మ పిలుపునిచ్చారు. నగరంలో మద్యం బ్లాక్‌ విక్రయాలపై దృష్టి సారించాలని అధికారులను కోరారు. మద్యం విక్రయాలకు ఆధార్‌తో అనుసంధానం చేస్తే మైనర్‌లకు మద్యం అందే అవకాశం ఉండదని సూచించారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని ప్రస్తుతించారు.

మహోద్యమం కావాలి..
విశ్రాంత డీజీపీ వాసుదేవరావు మాట్లాడుతూ.. మద్య విమోచన ఉద్యమం మహోద్యమం కావాలని పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలన, మద్యపాన నిషేధం వంటి నిర్ణయాలు వైఎస్‌ జగన్‌ చేస్తోన్న మంచి పాలనకు నిదర్శనమన్నారు. వీటినే సామాన్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు  శ్రీనివాస్, గాంధీ సెంటర్ అధ్యక్షులు ప్రొఫెసర్ బలమొహన్ దాస్,  వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి, మత్స్యకార నేత జానకి రామ్, ఎక్సైజ్‌ డీసీ శ్రీనివాసరావు, న్యాయ సలహాదారు రామకృష్ణ రావు, సమన్వయ కర్త సురేష్ బేత తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు