ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి అవంతి శ్రీనివాస్‌

4 Oct, 2019 12:26 IST|Sakshi

సాక్షి, విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుక్రవారం ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తారు. ఆటో హ్యాండిల్ పట్టి.. కాసేపు డ్రైవర్‌గా మారిపోయారు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఆటో డ్రైవర్లతో మమేమకం అయ్యారు. ఆటో డ్రైవర్‌ షర్టు వేసుకుని ఆటో నడిపారు. కాగా విశాఖ బీచ్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం గురజాడ కళాక్షేత్రంలో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పున చెక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ...‘తొలిసారిగా ఆటో నడిపే అవకాశం మీ ద్వారా కలిగింది. ఏ ఉద్యోగం లేని వ్యక్తులకు తొలి ఉద్యోగం ఇచ్చేది ఆటో మాత్రమే. రవాణా సదుపాయాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేది ఆటో డ్రైవర్లే. ఆటో డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసి వారి కోసం వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారు. 

ఈ పథకం ద‍్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు తీరును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. మీలో నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటో డ్రైవర్లకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. ఇది పేదల ప్రభుత్వం... పేదల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం. ప్రభుత్వంపై చేసే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలను ప్రేమించే వ్యక్తి...వేధించే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. విశాఖ జిల్లాలోనే ఆటో డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఏటా రూ.25 కోట్లు అందించాం’ అని అన్నారు.

ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం తీసుకువచ్చారు. మీ అందరి కష్టాలను నేరుగా పాదయాత్రలో చూసిన వ్యక్తి  సీఎం జగన్‌. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనది. ప్రజలందరి సంక్షేమమే మా ప్రభుత్వ థ్యేయం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పూర్థి స్థాయిలో అమలు చేయబోతున్నాం’ అని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, పిట్ల ఉమా శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, అదీప్ రాజ్, జివిఎంసి కమిషనర్ సృజన , విఎం ఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, అక్కరమాని విజయ నిర్మల,  కొయ్యా ప్రసాద్ రెడ్డి , డిటిసి రాజా రత్నం తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రజా సంకల్పయాత్రలో  2000 కిలోమీటర్ల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 2018 మే 14న ఆటో, కారు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన చోటే ..ఇవాళ వైఎస్సార్‌ వాహన మిత్ర పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏలూరులో ప్రారంభించారు.

మరిన్ని వార్తలు