మీ అత్యాశకు బాధ్యత చంద్రబాబుదా?

13 May, 2018 04:10 IST|Sakshi

సొమ్ము మమ్మల్ని అడిగి చెల్లించారా?  

అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రశ్నించిన మంత్రి అయ్యన్న

కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ‘‘అత్యాశకు పోయింది మీరు. రూ.1,000 చెల్లిస్తే రూ.50,000 వచ్చేస్తాయని ఆశపడి అగ్రిగోల్డ్‌లో ప్రీమియంలు చెల్లించారు. దానికి ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది?’’ అని రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘ది ఆర్యాపురం కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌’ ప్రధాన కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ బాధితుల గురించి మాట్లాడారు. ‘‘అగ్రిగోల్డ్‌కు సొమ్ము చెల్లించిన వారంతా మమ్మల్ని అడిగి చెల్లించారా? ఆ సంస్థలో సొమ్ము చెల్లించిన వారంతా అత్యాశకు పోయినవారే.

అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ప్రజల నుంచి దండిగా సొమ్ము వసూలు చేసి, చివరకు బోర్డు తిప్పేసింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా బాధ్యత వహిస్తారు?’’ అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని అన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల సీపీఐ నేతలు యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ... అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని సర్ది చెప్పారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) గురించి మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... మహిళలు చీరలు, జాకెట్లు, ఆఖరికి లో దుస్తులు కూడా కొనుగోలు చేయలేని విధంగా జీఎస్టీ ఉందని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు