విశాఖ భూదందాపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

30 May, 2017 15:02 IST|Sakshi
విశాఖ భూదందాపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
 
కాగా విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తెలిపారు. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఆయన రెవెన్యూ ఉన్నతాధికారులతో కలిసి విశాఖలో పర్యటించారు. సి.సి.ఎల్.ఎ. కార్యాలయం నుంచి సీనియర్ అధికారులను రికార్డుల పరిశీలనకు పురమాయించామన్నారు. బాధితుల నుంచి వివరాలు తీసుకొనేందుకు పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు.
 
జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ చేపడతామని వెల్లడించారు. బాధిత ప్రజలు ఎవరైనా తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లయితే సమస్య తప్పక పరిష్కరిస్తామన్నారు. బాధితులు రాజకీయ వత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ భూదందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుందని చెప్పారు.
>
మరిన్ని వార్తలు