ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే

16 Jul, 2020 17:21 IST|Sakshi

నాకెలాంటి సంబంధం లేదు : మంత్రి బాలినేని

సాక్షి, చెన్నై : తమిళనాడులో పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు మావేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుతో ఏ రాజకీయ నాయకుడికీ సంబంధం లేదన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆ నగదు ఇంట్లోనే ఉంచామని, బంగారం కొనేందుకు చెన్నై వెళ్తుండగా వాహనం పోలీసులకు పట్టుబడిందని గురువారం వివరించారు. కాగా 5 కోట్ల నగదుతో వెళ్తున్న ఓ వాహనాన్ని చెన్నై పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష  టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆ వాహనం వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులదంటూ నిందలు వేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఆరోపణలపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. చెన్నై పోలీసులకు చిక్కిన ఆ ఐదు కోట్ల రూపాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కుట్రపూరితంగానే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కారు దొరికిన సమయంలో తాను మంత్రిమండలి సమావేశంలో ఉన్నానని, ఆ విషయం తనకు సమావేశం అయిపోయే వరకూ తెలీదని మంత్రి బాలినేని అన్నారు. పోలీసులకు దొరికిన డబ్బు తనదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని సవాలు విసిరారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేత బొండా ఉమా క్షమాపనలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘లోకేష్ కూడా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా జీవితంలో ప్రజలు తిరస్కరించారు. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచావా లోకేష్? నా గురించి, నా రాజకీయ జీవితం గురించి మీ టీడీపీ నాయకులే చెప్తారు నేను మచ్చలేని వ్యక్తిని. ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలి. కారుపై ఉన్న జీరాక్స్‌ స్టిక్కర్‌ గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశాం.’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు