‘పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రారంభింపచేస్తాం’

16 Jun, 2019 15:33 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య ఉందన్నారు. ఒంగోలు, మర్కాపురంలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కావరిడార్‌ పనులపై త్వరలో సమీక్షిస్తామన్నారు. రైతులకు పగటిపైట తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 

త్రిపుల్‌ ఐటీ తరగతులను ఒంగోలుకు తీసుకొస్తాం : ఆదిమూలపు
జిల్లాకు కేటాయించిన ట్రిపుల్‌ ఐటీ ప్రస్తుతం ఇడుపులపాయలో నడుస్తోందని, ఆ తరగతులను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గత డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు త్వరలో జిల్లాల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేష్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రెండు ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాని మారుస్తామన్నారు.

మరిన్ని వార్తలు