ప్రకాశంలో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించిన బాలినేని

9 Jan, 2020 14:11 IST|Sakshi

సాక్షి, కొత్తపట్నం: చదువుకు పేదరికం అడ్డు కాకూడదని.. పేదల బిడ్డలు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంగ్లీష్‌ బోధనను దురుద్దేశం తోనే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. గురువారం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని..విద్యార్థుల తల్లులకు అమ్మఒడి చెక్కులను అందజేశారు. మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి చిన్నారుల తల్లులు పాలాభిషేకం చేశారు. బాలినేని మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా తీసిందని.. అయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారని చెప్పారు. కొత్తపట్నం మండలంలో త్వరలో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

జిల్లాలోని కందుకూరులో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ‘జగనన్న అమ్మఒడి పథకాన్ని’ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం’ ద్వారా విద్యార్థులకు కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి మద్దతుగా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాల ఓరియంటల్‌ యూపీ పాఠశాలలో ‘అమ్మఒడి’ పథకాన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఎం. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అమ్మఒడి పథకాన్ని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చుండూరు రవి, మండవ అప్పారావు, ఏఎంసీ చైర్మన్‌ ఎనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా)
(చదవండి: ‘వచ్చారు జగన్‌.. మెచ్చారు జనం’)

మరిన్ని వార్తలు