‘బోటు అనుమతులకు విధానాలు మారుస్తాం’

14 Nov, 2017 16:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌ వద్ద కృష్ణా నది పవిత్ర సంగమం ప్రాంతంలో 22 నిండుప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కొన్ని విషయాలను స్పష్టం చేశారు. మంత్రి బోటింగ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటింగ్‌ అనుమతులకు సంబంధించి విధానాలు మారుస్తామని చెప్పారు. ఇప్పటివరకు నదిలో పడవలు నడుపుకునేందుకు పర్యాటక శాఖతో సంబంధం లేకుండా జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆ విధంగా అనుమతులు తీసుకున్నవారెవ్వరూ పర్యాటక శాఖతో అగ్రిమెంట్‌​కావటం లేదని మంత్రి అన్నారు.

ఈ లోపాలు సరిదద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మంత్రి అన్నారు. విధివిధానాల్లో మార్పులు తీసుకొస్తామని, కొత్త పర్యాటక విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని ఆమె వివరించారు. పర్యాటక విధానంతోపాటు నీటి విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఈతగాళ్లను గుర్తించేందుకు వారికి ప్రత్యేక యూనిఫాం ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రమాదానికి గురైన బోటుకు జలవనరులు, పర్యాటక శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు.

గతంలో పలు ప్రమాదాలు
⇒ పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి పాయలో 2012 నవంబర్‌ 18వ తేదీ సాయంత్రం మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 మందితో వెళ్తున్న ఇంజిన్‌ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంకకు చెందిన కుటుంబాల వారు అదే జిల్లాకు చెందిన మాచేనమ్మ అమ్మవారి గుడికి నదీ మార్గంలో ఉదయం వెళ్లారు. సాయంత్రం తిరిగి బోటుపై ఇళ్లకు వస్తుండగా ప్రమాదం జరిగింది.
⇒ గత ఏడాది జూన్, జూలై నెలల్లో బొబ్బర్లంక వద్ద కాటన్‌ బ్యారేజి నుంచి ఒకేసారి నీరు వదిలేయడంతో లంక పొలాలకు వెళ్లే రైతుల్లో నలుగురు చనిపోయారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల రైతులు బోటు మీద వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

మరిన్ని వార్తలు