చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు: బొత్స

3 Oct, 2019 18:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు ముందే వస్తే ఎందుకు అమలు చేయలేదని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం మన్సిపల్‌ కమిషనర్లు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్ర  ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందని విమర్శించారు. ఒక్క మున్సిపల్‌ శాఖలోనే రూ. 15 వేల కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసిందని, అన్నా క్యాంటీన్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉన్న విషయం వాస్తవమేనని అందుకు బొగ్గు కొరత కారణమన్నారు. ప్రభుత్వంపై కన్నా లక్ష్మీ నారాయణ చేస్తున్న విమర్శలు ఏ దృష్టితో చేస్తున్నారో ఆయనే చెప్పాలని స్పష్టం చేశారు. 110 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని బొత్స వెల్లడించారు. మరోవైపు నిరాశ్రయులకు పునరావాసం కల్పించేందుకు ముగ్గురు అధికారులు, మూడు ఎన్జీవోలతో కలిసి అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

అంతకు ముందు జరిగిన వర్క్‌షాప్‌ సమావేశంలో ఎమ్‌ఎ అండ్‌ యుడి శాఖ డైరెక్టర్‌ మాట్లాడుతూ.. మోప్మా ద్వారా షల్టర్‌ ఫర్‌ హోంలెస్‌, సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ కార్యక్రమాలు, ప్రాథమిక ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి నలభై మందికి పైగా ఎన్జీవోలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆ శాఖ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. పురపాలక కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం లాంటి కొన్ని లోపాలు ఉన్నాయన్న ఆయన షల్టర్లు ఉన్నాయన్న విషయం చాలామంది కమిషనర్లకు తెలీదని వ్యాఖ్యానించారు. అధికారులు ఆఫీసులకు పరిమితం కావద్దని, క్షేత్రస్థాయిలో వెళ్తేనే ఫలితాలు ఉంటాయని సూచించారు. ఒక స్థాయిలో మార్కెట్‌లో మంచి పేరు వచ్చాక ఆన్‌లైన్‌ సైట్లకు లింక్‌ చేసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. అంతేకాక, యువతకు స్కిల్‌ ట్రైనింగ్‌, ఎంప్లాయిమెంట్‌ సరిగ్గా జరగడం లేదని సమావేశ దృష్టికి తీసుకొచ్చారు.  

మరిన్ని వార్తలు