‘మెరిట్ ఆధారంగానే సచివాలయ పోస్టుల భర్తీ’

31 Aug, 2019 19:25 IST|Sakshi

అభ్యర్ధులకు మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా

గ్రామ వార్డు సెక్రటరీల పరీక్షల ఏర్పాట్లపై మంత్రి ఆరా

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నియమాకానికి సెప్టెంబరు 1వ తేదీ (రేపటి నుంచి) 8 వతేదీ వరకు రాత పరీక్షలు జరగనున్నాయి. పరిపాలనలో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టే గ్రామ, వార్డు కార్యదర్శుల పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సుమారు 1.27 లక్షల పోస్టులకు 21 లక్షల మందికి పైగా అభ్యర్ధులు పోటీ పడుతున్న నేపథ్యంలో పకడ్బందీగా, షెడ్యూలు ప్రకారం పరీక్షలు జరిగేట్లు చూడాలని చెప్పారు.

పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. జిల్లాల్లో అధికారులందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని మరోసారి పరిశీలించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. పరీక్షలకు హాజరవుతున్నఅభ్యర్థులందరూ ఎటువంటి వదంతులను నమ్మవద్దనీ, పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయనున్నామని మంత్రి స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు