సీఎం జగన్‌ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు : బొత్స

7 Apr, 2020 20:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కరోనా అనుమానితులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 3,374 మందికి పరీక్షలు నిర్వహించగా 304 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. మర్కజ్‌ వెళ్లివచ్చిన వారి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని 90 నుంచి 1170కి పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని తెలిపారు. కరోనాకు సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు టమాటా రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. ఆక్వా రంగం దెబ్బతినకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వలస కూలీలకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరారు.

మరిన్ని వార్తలు