కుట్రలతో సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు

23 May, 2020 18:29 IST|Sakshi

టీడీపీ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌

సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ రాష్ట్రాల్లో అమలు కానన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాది లోపే మేనిఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. 2019 మే 23 సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని పేర్కొన్నారు.
(నిబద్ధతతో సేవలందించండి: సీఎం జగన్‌)

అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు సాధ్యం కాదని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారని.. మనసు ఉంటే మార్గం ఉంటుందనే విధంగా ఆయన హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడానికి నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టారని.. రైతే రాజు అనే విధంగా వ్యవసాయానికి పెద్దపీట వేశారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌ ఆశయాలను వైఎస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారన్నారు. పట్టుదలతో సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
(టీడీపీ ఉనికి కోల్పోయింది: ధర్మాన కృష్ణదాస్‌)

టీడీపీ వైఖరిని ప్రజలు గమనించాలి..
‘‘దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో 500కి మించి కరోనా టెస్ట్ లు జరగలేదు. విద్య వైద్యాన్ని రెండు కళ్లుగా సీఎం జగన్‌ చూస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అసభ్య పదజాలంతో సీఎంపై విమర్శలు చేస్తున్నారు. న్యాయ స్థానాలకు వెళ్లి టీడీపీ ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటుందని’’ ధ్వజమెత్తారు. టీడీపీ వైఖరిని ప్రజలంతా గమనించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. కుట్రలు కుతంత్రాలతో టీడీపీ కోర్టులకు వెళ్తుందని మండిపడ్డారు.
(చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత)

పేదలకు న్యాయం.. అదే ప్రభుత్వ లక్ష్యం..
పేదలకు న్యాయం జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.  పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని బొత్స ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని.. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చుతున్నారని తెలిపారు. విపత్తు కాలంలో చిన్న,సూక్ష్మ,మధ్య తరహా పారిశ్రామికవేత్తలను సీఎం ఆదుకున్నారని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ముఖ్యమంత్రి అండగా నిలిచారన్నారు.

చం‍ద్రబాబు సమాధానం చెప్పాలి..
చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతారని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్న లేకపోయినా ఒకే విధంగా ఉంటారన్నారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎత్తేశారని..పారిశుధ్య కార్మికుల, ఆశ వర్కర్లకు సీఎం జగన్‌ జీతాలు పెంచారన్నారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం ఎక్కడ వైపల్యం చెందిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను చర్చించే సమయంలో తమను కూడా జూమ్‌లోకి తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో జూమ్‌ యాప్‌లో చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి బొత్స సవాల్‌ విసిరారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

చారిత్రాత్మక స్తూపం కాదు.. సిమెంటు కట్టడం..
టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు విమర్శలపై మంత్రి బొత్స  మండిపడ్డారు. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక స్తూపం కాదని.. మూడు లాంతర్ల అనేది సిమెంట్ కట్టడమని.. మూడు లాంతర్ల సెంటర్ లో పనులు జరుగుతున్నాయన్నారు. మూడు లాంతర్ల సూప్తం స్థానంలో కొత్తది నిర్మాణం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. మూడు లాంతర్లు అనేది చరిత్రాత్మక ప్రాంతమని.. స్తూపం మాత్రం కాదని స్పష్టం చేశారు. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక కట్టడం అంటున్న అశోక్ గజపతిరాజు.. ఆ స్తూపం ఆయన పుట్టక ముందు కట్టిందా ఆయన పుట్టిన తరువాత కట్టిందా సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ విమర్శలు మానుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

మరిన్ని వార్తలు