సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొత్స

10 Sep, 2019 12:52 IST|Sakshi

సాక్షి, విజయనగరం: అవినీతి రహితపాలనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనికి అందరూ సహకరించాలని, తమది స్నేహపూర్వక ప్రభుత్వమని పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనతో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి కాపాడాలని వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. చట్టబద్దంగా, రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నామన్నారు. ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం అందరికి జవాబుదారీగా పనిచేయాలని బొత్స అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులంతా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఉద్యోగుల యోగక్షేమాలను ప్రభుత్వం తప్పక చూస్తుందన్నారు. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని..  దానిలో భాగంగానే పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 

సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఉన్నతాధికారులతో చర్చించి అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. కొందరు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఎవ్వరూ నమ్మొద్దని కోరారు. అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎవ్వరినీ తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. ఇది ముఖ్యమంత్రి తమందరితో చెప్పిన మాటని మంత్రి స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు