లాక్‌డౌన్‌ మరింత పటిష్టంగా అమలు: మంత్రి బుగ్గన

5 May, 2020 17:36 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ప్రథమస్థానంలో ఉందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దూరం పాటిస్తూ కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచుతున్నామని తెలిపారు.
(ద్రోహం చేసింది చంద్రబాబే..!) 

కరోనా వైరస్ నివారణా చర్యలపై జిల్లాల వారీగా ప్రతి రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికంగా కరోనా టెస్ట్ లు చేయడం వల్లే పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని.. నమోదైన కేసుల్లో 95 శాతం మంది ఎలాంటి కరోనా లక్షణాల వ్యాధి బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు అధికంగా ఉన్నవారికి మాత్రమే కాస్త ఇబ్బంది కలిగే అవకాశం వుందని.. నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్యను పోల్చి చూస్తే మరణాల రేటు అతి తక్కువగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
(మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం) 

గత వారం రోజుల నుండి పరిశీలిస్తే పాజిటివ్ కేసుల నమోదు కన్నా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యే వారి సంఖ్య అధికంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక పోలీస్ అధికారి  హార్ట్ బైపాస్ ఆపరేషన్ జరిగి, ఇతర వ్యాధులు ఉండి కూడా కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కాకుండా శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అధికంగా పాజిటివ్ కేసులు వున్న కర్నూలు, నంద్యాల పట్టణాల్లోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. గుంటూరు, ప్రకాశం, ఇతర రాష్ట్రాలలో ఉన్న  వలస కార్మికులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాకు రప్పించి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్ లలో వుండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కోవిడ్ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు, పోలీసు అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర అధికారులు భయానికి గురి కాకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.

మరిన్ని వార్తలు