మంత్రి గంటా ఆస్తులు బ్యాంక్ స్వాధీనం

22 Feb, 2017 20:13 IST|Sakshi
మంత్రి గంటా ఆస్తులు బ్యాంక్ స్వాధీనం

సాక్షి, అమరావతి: రుణాల ఎగవేత కేసులో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన మరిన్ని ఆస్తులను బ్యాంక్ స్వాధీనం చేసుకున్నాయి. గంటా కుటుంబానికి చెందిన ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ ఇండియన్‌ బ్యాంక్‌కు రూ.141 కోట్లు బకాయి ఉన్న సంగతి తెలిసిందే.

గత కొంత కాలంగా రుణాలు చెల్లించకపోవడంతో బాకీ మొత్తం రూ. 203.62 కోట్లకు చేరింది. దీంతో ఆ కంపెనీకి చెందిన ఆస్తులతో పాటు రుణానికి హామీగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకి చెందిన ఆస్తులను బ్యాంక్‌ స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే విశాఖతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంక్‌ తాజాగా హైదరాబాద్, చెన్నైలోని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పత్రికా ప్రకటన జారీ చేసింది.

హైదరాబాద్‌లో ల్యాంకో హిల్స్‌లో కంపెనీ పేరు మీద ఉన్న రెండు ఫ్లాట్లతో పాటు, తమిళనాడులోని కాంచీపురం జిల్లా షోలింగనల్లూర్‌లో ఉన్న 6,000 చదరపు అడుగుల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆస్తులను ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించి తమకు తెలియకుండా ఎటువంటి క్రయవిక్రయాలు జరపరాదని ఆ బహిరంగ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు