కేంద్ర ప్యాకేజీపై స్పష్టత రావాల్సి ఉంది

14 May, 2020 15:56 IST|Sakshi

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) కేంద్రం ప్యాకేజీ ప్రకటిందని.. అయితే ఆంధ్రప్రదేశ్‌కు జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీకి సంబంధించిన మార్గదర్శకాలు రావాలన్నారు. కేంద్రం రాష్ట్రాల వారీగా ఆ ప్యాకేజీని అమలు చేస్తుందా లేదా అన్నది చూడాలన్నారు. 3 లక్షల కోట్ల ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు రావాలని ఆయన కోరారు. రుణాలపై మారిటోరియం, టాక్స్‌ హాలిడే ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తేనే పారిశ్రామిక రంగాన్ని ఆదుకోగలుగుతామని చెప్పారు.
(‘టీడీపీ జూమ్‌ పార్టీలా మారింది’)

97 వేల ఎంఎస్‌ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వాటికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ అమలుకు చర్యలు చేపట్టామని.. దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్‌కు కొరియన్‌ బృందం వచ్చిందని.. 14 రోజులు అక్కడే ఉండి అధ్యయనం చేస్తారని చెప్పారు. హై పవర్‌ కమిటీ కూడా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోందని, అనంతరం నివేదికల ఆధారంగా భవిష్యత్‌ నిర్ణయాలు ఉంటాయని మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు.
(విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి)

మరిన్ని వార్తలు