నిబంధనలు అతిక్రమిస్తే సహించం: గౌతమ్‌రెడ్డి

8 May, 2020 15:49 IST|Sakshi

విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై మంత్రి సమీక్ష

సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించమని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించారని పేర్కొన్నారు.
(యుద్ధ ప్రాతిపదికన స్పందించాం)

తనతో సహా మంత్రులను విశాఖకు పంపించి.. సాధారణ పరిస్థితి వచ్చేలా చూడాలని సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు. ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమని గ్రీన్ ‌ట్రిబ్యునల్‌ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు. (పరిశ్రమల శాఖను అప్రమత్తం చేసిన మంత్రి)

ఎల్జీ పాలిమర్స్‌ ప్రతినిధులు,నిపుణులతో మంత్రి భేటీ..
ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ప్రతినిధులు, నిపుణులతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ట్యాంక్‌ పరిస్థితిపై సమీక్షించామని తెలిపారు. ట్యాంక్ ఉష్ణోగ్రత 120 కన్నా తక్కువ గా ఉందని.. కొన్ని రసాయనాలు వాడి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని తెలిపారు. ‘‘ఇప్పుడు వచ్చిన నిపుణులు ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది. స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉంది. దీని వల్ల ప్రమాదం లేదు. ఇది ఎక్కువ శాతం గాల్లో కూడా ఉండదు. ఇది భూమి మీద పడిపోతుంది. దీని వల్ల ప్రమాదం లేదని’’ మంత్రి వివరించారు. రాష్ట్రంలో 86 కంపెనీలు గుర్తించామని.. భద్రత ప్రమాణాలు పరిశీలించిన తరువాతే ప్రారంభించడానికి అనుమతులు ఇస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.(గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

మరిన్ని వార్తలు