రాజీనామా తప్పదా..!

18 Sep, 2013 09:35 IST|Sakshi
రాజీనామా తప్పదా..!

సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్‌లో తన ఉండడంతో డాక్టర్‌. జె. గీతారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంత్రి రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి పేరును కూడా సీబీఐ తన చార్జిషీటులో పేర్కొనడంతో   ఆమె తన  పదవికి రాజీనామా చేస్తారా అన్నఅంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లేపాక్షి సంస్థకు భూ కేటాయింపులకు సంబంధించి సీబీఐ ఆగస్టు 27న గీతారెడ్డిని సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించింది.
 
 సుమారు 20 రోజుల తర్వాత మంగళవారం దాఖలు చేసిన చార్జిషీటులో మంత్రిని తొమ్మిదో నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. ఇదే అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ ఏడాది మే 19న తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గీతారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అంశం కూడా తెరమీదకు వస్తోంది. సీబీఐ చార్జిషీటులో గీతారెడ్డి పేరును కూడా చేర్చడంతో మంగళవారం మంత్రి తన నియోజకవర్గం జహీరాబాద్‌లో పర్యటనను ఆమె అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. రంజోల్‌లో వినాయక మండపాల వద్ద పూజల్లో పాల్గొనడంతో పాటు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో గీతారెడ్డి పర్యటన రద్దయినట్లు ప్రకటించారు.
 
 డిప్యూటీ వర్గానిదే పైచేయి?
 రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జిల్లా రాజకీయాలపై పట్టు సాధించేందుకు డిప్యూటీ సీఎం , మంత్రి గీతారెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పదవికి పోటీ పడినా ఆ పదవి దామోదరకు దక్కింది. ఆ తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్ జిల్లా నేతలు డిప్యూటీ సీఎంకు సన్నిహితమవుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గీతారెడ్డి పోటీ చేయరనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఆరోపణలు సాకుగా తీసుకుని అటు సొంత పార్టీతో పాటు, రాజకీయ ప్రత్యర్థులు కూడా పైచేయి సాధించేందుకు పావులు కదిపే సూచనలు కనిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు