మంత్రి కామినేనికి అవమానం

21 Nov, 2017 11:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అవమానం జరిగింది. ఉండవల్లి కరకట్ట మీదకు వెళ్లే రహదారి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే రోడ్డులో ...సెక్యూరిటీ పేరు చెప్పి మంత్రి వాహనాన్ని మంగళవారం ఉదయం భద్రతా సిబ్బంది నిలిపివేశారు. అసెంబ్లీకి అటువైపుగా దారి లేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.

బ్యారికేడ్లు పెట్టి మంత్రి కామినేని శ్రీనివాసరావు, నలుగురు ఎమ్మెల్యేల కార్లను ఆపారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్‌మన్‌లతో వాగ్వివాదానికి దిగారు. 15 నిమిషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు.  మరోవైపు సీఎం ఇంటికెళ్లే కరకట్ట మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజధాని ప్రాంత ప్రజలను కూడా అటువైపు నుంచి రాకపోకలు సాగనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

కాగా కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీరియస్ అయ్యారు. పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించారు.

గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీకి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది.  గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కరకట్టపై నుంచి శాసనసభకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో  శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట‍్ట దగ‍్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు.

మరిన్ని వార్తలు