అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కు ఫిర్యాదు చేయండి : కన్నబాబు

3 Oct, 2019 15:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ధరల స్థిరీకరణ నిధిని వినియోగించి రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. అదే విధంగా సహకార శాఖను ఆధునికీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... నష్టాల్లో ఉన్న డీసీసీబీలను గాడిలో పెట్టి.. బకాయిల వసూళ్లపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు నిపుణుల కమిటీని నియమించనున్నట్లు పేర్కొన్నారు. ‘రైతు ఏ దశలో కూడా నష్టపోకూడదన్నదే సీఎం జగన్‌ లక్ష్యం. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చరల్ అసిస్టెంట్‌కి ఫిర్యాదు చేయండి. రైతు భరోసా భారీ సంక్షేమ కార్యక్రమం. అక్టోబర్ 15న ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు’ అని తెలిపారు.

అదే విధంగా అక్టోబర్ 15 నుంచి అపరాల కొనుగోలు ప్రారంభిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఫామాయిల్‌కు తెలంగాణాలో ఉన్న ధరనే రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా ఫామాయిల్‌ ధర రూ. 10వేలు చేయాలని విన్నవిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారని తెలిపారు. కాగా నేతన్నలకు మేలు చేకూర్చేవిధంగా ఆప్కో సంస్కరణల కోసం కూడా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు