‘పోలీసుల సేవలు ప్రశంసనీయం’

17 Oct, 2019 14:06 IST|Sakshi

రక్తదాన శిబిరాన్ని సందర్శించిన మంత్రులు

సాక్షి, విజయవాడ: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. నిత్యం కష్టపడి పనిచేస్తూ.. సమాజాన్నికాపాడటంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్నారు. రాష్ట్రంలో నక్సల్స్‌ దాడుల్లో అనేక మంది పోలీసులు అమరులయ్యారన్నారు. పోలీసుల సంక్షేమ కోసం తొలిసారిగా వారాంతరపు సెలవును మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సుమారు 600 మంది పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న పోలీసు శాఖ సంకల్పం అభినందనీయమని కురసాల కన్నబాబు అన్నారు.

సేవలు ప్రశంసనీయం:మంత్రి వెల్లంపల్లి
 కుటుంబాలను సైతం వదిలి నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్‌ శాఖ సేవలు  ప్రశంసనీయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నారని సీపీ ద్వారకా తిరుమలరావును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అభినందించారు.

అపోహలను పొగొట్టడమే లక్ష్యం: సీపీ
అక్టోబర్‌ 15 నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని విజయవాడ సీపీ ద్వారాక తిరుమలరావు తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాల గురించి అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీస్‌ శాఖ పట్ల ఉన్న అపోహలను పొగొట్టాలన్నదే తమ లక్ష్యమన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు