ప్రాణత్యాగానికైనా వెనుకాడని పోలీసులు: కొడాలి నాని

19 Oct, 2019 12:51 IST|Sakshi
ఆయుధాల పనితీరును పరిశీలిస్తున్న మంత్రి కొడాలి నాని 

సాక్షి, గుడివాడరూరల్‌(విజయవాడ) : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ పోలీసుశాఖ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తోందని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నాని జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎం.సత్తిబాబు, డీఎస్పీ ఎం.సత్యానందంతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మంత్రి నాని మాట్లాడుతూ శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ కల్పించడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ బాధ్యతలను నిర్వహించేది పోలీసులేనన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాత్రీపగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తారన్నారు.

పోలీసు పట్ల ప్రజల్లో ఉండే భయాన్ని పోగొట్టేందుకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. తొలుత ఆయుధాల ప్రదర్శనను మంత్రి కొడాలి నాని తిలకించారు. ఆయుధాల పనితీరు, వినియోగించే సమయంలో తమను తాము రక్షించుకునే పద్ధతులను మంత్రికి పోలీసు అధికారులు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రామ్‌ప్రసాద్, ఎంవీ నారాయణరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అడపా వెంకటరమణ(బాబ్జీ), పట్టణ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడివాడ, నందివాడ మండలాల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు మట్టా జాన్‌విక్టర్, పెయ్యల ఆదాం, నాయకులు వెంపటి సైమన్, ఎం.చంద్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు