చంద్రబాబు నక్కజిత్తులను మోదీ నమ్మరు..

9 May, 2020 17:33 IST|Sakshi

మంత్రి కొడాలి నాని

సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన దురదృష్టకరమని మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. హెల్త్‌ కార్డులు జారీ చేసి వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మృతుల కుటుంబాలకు  సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి వైద్యసేవలు అందించడంతో పాటు 10 లక్షల ఆర్థికసాయం, చికిత్స పొందుతున్నవారికి రూ.లక్ష ప్రకటించారని వెల్లడించారు.
(‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’) 

ఆ కంపెనీని అప్పుడెందుకు మూయించలేదు..
గ్యాస్‌ లీక్‌ ఘటనను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందన్నారు. ప్రజల భద్రతే మాకు ముఖ్యమని.. ఫ్యాక్టరీ వల్ల ప్రమాదముందని నివేదిక వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐఏఎస్‌లతో వేసిన కమిటీని చంద్రబాబు తప్పుబడుతున్నారని.. టీడీపీకి చెందిన దద్దమ్మలతో డ్రామా కమిటీ వేశారని దుయ్యబట్టారు.1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని.. అప్పుడెందుకు కంపెనీని చంద్రబాబు మూయించలేదని ప్రశ్నించారు. హిందూస్థాన్‌ పాలిమర్‌ను.. ఎల్‌జీ పాలిమర్‌గా మార్చింది చంద్రబాబేనని పేర్కొన్నారు. 2017లో కూడా కంపెనీ విస్తరణకు చంద్రబాబు పర్మిషన్‌ ఇచ్చారని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్‌ వల్ల 30 మంది చనిపోయారని.. వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా అని కొడాలి నాని ప్రశ్నించారు.
(‘ప్రజల భద్రతే ముఖ్యం కంపెనీ కాదు’)

అందితే జట్టు..అందకపోతే కాళ్లు..
కరోనాకు భయపడి అద్ధాల మేడలో ప్రతిపక్షనేత చంద్రబాబు అద్దాల మేడలో దాగున్నారని..ఆయన ఇంటి నుంచి బయటకు రావడంలేదని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిన లేఖలపై చంద్రబాబు సంతకాలు పెడుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందన్నారు. పరిహారంపై గతంలో ఒక విధంగా..నేడు మరొకలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ సంగతి తెలుస్తానని చంద్రబాబు గతంలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. చంద్రబాబు అందితే జట్టు..అందకపోతే కాళ్లు పట్టుకుంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని నక్కజిత్తులు వేషాలు వేసిన మోదీ నమ్మరన్నారు.ఎల్జీ కంపెనీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని కొడాలి నాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు