పవన్‌ రెండుచోట్లా ఎందుకు ఓడిపోయావ్‌!!

4 Nov, 2019 14:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ఎందుకు చేశారో ప్రజలకు అర్థం కాలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సోమవారం రోజున ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లాంగ్‌ మార్చ్‌లో వరదల్లో ఇసుక ఎలా తీస్తారో అనే టెక్నాలజీ గురించి చెప్తారేమో అని ఎదురు చూశాం. జనంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే లాంగ్‌మార్చ్‌కి అన్ని పార్టీలను జనాల్ని పంపమని ఎందుకు అడిగారు..? పవన్‌ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని కూడా సరిగా చదవలేకపోయారని విమర్శించారు. వేదికల మీద అర్థం లేకుండా ఊగిపోతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనం అసహ్యించుకుంటారని అన్నారు.

కన్నబాబుని నాగబాబు గెలిపించారని అంటున్నారు. మరి అదే నిజమైతే మీ అన్న నాగబాబు ఎందుకు గెలవలేకపోయారు..? మీ అన్నను నువ్వెందుకు గెలిపించలేకపోయావో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు నిన్ను నమ్మడం లేదని గుర్తించాలి. ప్రజలు మీతో ఉంటే మీరెందకు రెండు చోట్లా ఓడిపోయారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఇసుకను మింగేసి అచ్చెన్నాయుడు ఆంబోతులా బలసిపోయారు. నాగావళి నదిలో ఇసుకను బకాసురుడులా మింగేశారు. అలాంటి అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకొని పవన్‌ మాకు నీతులు చెప్తారా..? అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఏరియాలో రంగురాళ్లను దోచేశారని పేర్కొన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని పవన్‌ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుది శాడిస్టు పాలన కాబట్టే జనం ఓడించారని మంత్రి నాని విమర్శించారు.

మరిన్ని వార్తలు