ఓపెన్‌ హౌజ్‌ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని

18 Oct, 2019 15:19 IST|Sakshi

సాక్షి, గుడివాడ: పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం గుడివాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలను గురించి ఓపెన్‌ హౌజ్‌ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడమనేది మంచి కార్యక్రమమని  ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పోలీసు శాఖపై ఉన్న అపోహలు తొలగి పోలీసుశాఖ మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందన్నారు. 

జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులు.. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం సంతోషకరంగా ఉందన్నారు. వారోత్సవాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. పోలీసులు సమాజాన్ని కాపాడుతూ శాంతి భద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారనీ, ఈ క్రమంలో సంఘ విద్రోహకక శక్తుల చేతుల్లో అనేక మంది పోలీసులు అమరులు అవుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరపుకొని అమరులైన పోలీసు సిబ్బందిని గుర్తు చేసుకోవడమే నిజమైన నివాళి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసుల సంక్షేమం కోసం తొలిసారిగా పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు