చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ

15 Nov, 2019 14:36 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు బురద రాజకీయాలు చేసున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడ మచిలీపట్నం రోడ్డులోని ఇసుక పాయింట్‌ను పరిశీలించిన మంత్రి.. రోజుకు ఎంత ఇసుక స్టాక్‌ ఉంచుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, వేల కోట్ల రూపాయల ఇసుకను చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. అంతేగాక చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలోని టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని మండిపడ్డారు.

గత రెండు రోజులుగా రోజుకు లక్షా యాభై వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు రావడంతో ఇసుకను బయటకు తీయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించింది కాదని అన్నారు. ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఆధారాలు చూపించమంటే పారిపోయారని, ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలని.. దీక్షలు చేసే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం శాసన సభ్యులు దాడి చేశారని గుర్తు చేశారు. లోకేష్‌ కనుసన్నల్లో నడుస్తున్న బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని నాని ఆరోపణలు చేశారు.

బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇసుక మాఫియా కింగ్‌ అని అన్నారు. ఆయన తన అనుచరులతో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించిన చరిత్ర ఉమాదేనని అన్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు జరిమానా విధించినా చంద్రబాబుకు బుద్దిరాలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక కుంభకోణాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని, ఇప్పుడు ఇసుక కుంభకోణం అంటూ దొంగ దీక్షలు చేయడం విడ్డూరమన్నారు.

>
మరిన్ని వార్తలు