అసలు మీదారి ఎటు?: మంత్రి కన్నబాబు

13 Jul, 2020 16:01 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: గోదావరిలో లేని వరదలను ఉన్నట్లు ఈనాడు పత్రిక తప్పుడు కథనాలను రాస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత ఫొటోలను ప్రచురించి ప్రజలను ఆ పత్రిక భయాందోళనలకు గురి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జలకళ సంతరించుకుందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు రైతులు సంతోషంగా ఉంటే సహించలేరని, అలాంటి వారు పత్రికల ద్వారా విషం కక్కుతున్నారని  దుయ్యబట్టారు.

అసలు మీ దారి ఎటూ..
‘‘గోదావరి వరద పై ఓ అసత్య కథనాన్ని ప్రచురించడం దారుణం. గడచిన 3, 4 దశాబ్దాల్లో లేనంతంగా వరద గత ఏడాది గోదావరి, కృష్ణా నదులలో వచ్చింది. అన్నింటిని సమీక్షించి..ఈ ఏడాది ముందస్తుగా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. పోలవరం కాంట్రాక్టర్లకు కాసులు కురిపించాలని చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లే కాఫర్ డ్యామ్ వల్ల గత ఏడాది గోదావరికి ముంపు అధికమైంది. ఆయన చేసిన పని వల్ల ఆనాడు వరద గ్రామాల్లో సహయక చర్యలు అందించడానికి 108,104 వాహనాలు లేవు. కానీ ఇవాళ.. వరద ముంపు గ్రామాల్లో సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. సహయక చర్యలు అందించేందుకు 108,104 వాహనాలు ఉన్నాయి. గత ఏడాది వరదలకు ముంపు గ్రామాల్లో  విద్యుత్ సరఫరా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా విద్యుత్ స్తంబాలను 11.5 మీటర్ల ఎత్తుకు మార్చాం. అసలు మీదారి ఎటూ అని ఈనాడును అడుగుతున్నా’’ అంటూ కన్నబాబు నిలదీశారు. (హ్యారీపోటర్​ను మరిపిస్తున్నావ్ కిట్టన్నా!)

ఆ తప్పుడు లెక్కలు ఎవరిచ్చారు..
చంద్రబాబు అబద్దాల ఫ్యాక్టరీకి యనమల అప్రకటిత అధ్యక్షుడని.. అసమానతలు, అసత్యాలను ఆయన ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం రద్దు చేసిందని యనమల చెబుతున్న రూ.18120 కోట్ల తప్పుడు లెక్కలు ఎవరిచ్చారు అని కన్నబాబు ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు రూ.42603 కోట్లు ఇచ్చాం. 3.9 కోట్ల మందికి ప్రయోజనం కలిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 21 పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకాన్ని రద్దు చేశామో యనమల చెప్పాలి?. బురద చల్లితే ప్రభుత్వమే కడుక్కుంటుందన్న ధోరణితో యనమల మాట్లాడుతున్నారని మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు. 3 లక్షల ఉద్యోగాలు తొలగించామని కళా వెంక్రటావ్ అంటున్నారు. ఎక్కడ తొలగించామో నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. సీఎం జగన్  4 లక్షల మందికి సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాలు కల్పించారని కన్నబాబు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు