అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కన్నబాబు

16 Aug, 2019 20:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని వరద పరిస్థితిపై వ్యవసాయశాఖ మంత్రి కురుసాల కన్నబాబు.. కలెక్టర్‌ ఇంతియాజ్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంత్రికి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచించారు. రాత్రి వేళల్లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.

సాగునీటి కాల్వల ద్వారా రైతుల చివరి ఆయకట్ట వరకు నీరు అందేలా చూడాలని  అన్నారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కైకలూరు నియోజకవర్గాల్లోని కాల్వలకు నీటిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. రైతులకు నీటి విడుదల పూర్తయ్యే వరకు ఇరిగేషన్‌ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు  వెనుకాడొద్దని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు