మాటల మాంత్రికుని హామీకి రెండేళ్లు

20 Sep, 2013 02:47 IST|Sakshi


 కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ :
 రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి మాటల మనిషే తప్ప చేతల మనిషి కాదని తేలిపోయింది. సొంత నియోజకవర్గం కందుకూరు పట్టణ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు శూన్యం. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలతో పాటు కందుకూరు మున్సిపాలిటీని కూడా ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన కింద చేర్చింది. అంటే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారన్నమాట. మురికివాడలన్నీ అభివృద్ధి చేస్తామన్న మంత్రి మాటలు పత్రికల్లో తూటాల్లా పేలాయి. ఆ తూటాలకు భయపడిన అధికారులు *లక్షలు ఖర్చుచేసి ప్రతిపాదనలు పంపారు. మాటల మాంత్రీకుడు నేటికీ ఆ పథకం తీరుతెన్నులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు మంత్రిని మాటల మరాఠీగా అభివర్ణిస్తున్నారు.
 
  హామీకి రెండేళ్లుకందుకూరు మున్సిపాలిటీకి రాజీవ్ ఆవాస్ యోజన మంజూరైనట్లు రెండేళ్ల క్రితం మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్యారా మురికి వాడలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మురికి వాడల్లో రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రలు నిర్మిస్తామని చెప్పారు. పట్టణంలో గూడులేని పేదవారిని గుర్తించి ఇళ్లు నిర్మించుకునేందుకు సుమారు * 3.50 లక్షలు చొప్పున ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభత్వం 30 శాతం, లబ్ధిదారుడు 20 శాతం భరించాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీంతో గూడులేని పేదలు, పట్టణ ప్రజలు సంతోషించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని మున్సిపాలిటీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు పట్టణంలోని 26 వార్డుల్లో మురికి వాడలను గుర్తించి విడతల వారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ ప్రైవేటు సంస్థ ద్వారా శాటిలైట్ సర్వే చేయించి సమగ్ర నివేదికను తయరు చేశారు.
 
  ఇందుకోసం మున్పిపాలిటీ * 6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతగా ఒకటో వార్డును ఎంపిక చేశారు. ఈ వార్డులో 156 మందికి గృహాలు నిర్మించాలని, డ్రెయిన్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేయాలని ఇందుకు * 36 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్ పంపారు. అక్కడ అనుమతి పొందితే ప్రతిపాదనలు ఢిల్లీ కూడా పంపాల్సి ఉంది. సంబంధిత ఫైలు హైదరాబాద్ చేరినా మంత్రి పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ఫల్గుణకుమార్‌ను ‘న్యూస్‌లైన్’వివరణ కోరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు