‘కొందరిలోనే సమాజసేవ ఆకాంక్ష’

23 Sep, 2019 11:24 IST|Sakshi
 సభలో మాట్లాడుతున్న మంత్రి   

సాక్షి, హిందూపురం : సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష కొందరిలోనే ఉంటుందని, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారు సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. స్థానిక పంచజన్య శ్రీనివాసభారతి చారిటుబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ స్కూల్స్‌ వెల్ఫర్‌ అసిసోయేషన్, బెంగళూరు పీపుల్స్‌ ప్రీ హాస్పిటల్స్‌ సౌజన్యంతో పంచజన్య స్కూల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఏటా మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు నాణ్యమైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేస్తున్న పంచజన్య శ్రీనివాస్‌ సేవలను అభినందించారు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ వైద్యులను ఇక్కడకు రప్పించి, వారి చేత వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయమన్నారు. కేవలం వైద్య శిబిరాలే కాకుండా ఇతర సామాజిక సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని కోరారు.

శ్రీనివాసులు మాట్లాడుతూ.. కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్య నిపుణులు 15 మందిని ఒక చోట చేర్చి అన్నిరకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు చేయించడంతో పాటు మందులూ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి శంకరనారాయణ వైద్యశిబిరంలో పర్యటిస్తూ రోగులకు పంపిణీ చేస్తున్న మందుల వివరాలు, చికిత్స విధానాలు అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమానికి అతి«థులుగా ప్రీపుల్స్‌ హాస్పిటల్‌ సీఈఓ చంద్రశేఖర్, మునియప్ప, మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌రావు, ఎంఈవో గంగప్ప, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పుల్లారెడ్డి హాజరయ్యారు. శిబిరంలో సుమారు 1,500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచజన్య స్కూల్‌ కోశాధికారి నందకిషోర్, ఏఓ భాస్కర్, హెచ్‌ఎం గాయత్రి, ఏహెచ్‌ఎంలు విజయేంద్ర, శశికళ, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ నాయకులు వేణుగోపాల్, రియాజ్, ముస్తఫా అలీఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు