ప్రజాదరణ లేకే టీడీపీ నేతల్లో ఆందోళన

10 Sep, 2019 10:24 IST|Sakshi

మంత్రి శంకరనారాయణ 

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు నెలల పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ప్రజాదారణ పూర్తిగా కోల్పోయామనే భావన వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోందని ఎద్దేవా చేశారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు దిగజారుడు ఆరోపణలు చేస్తూ వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అధికారులను తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారన్నారు. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఐదేళ్లు రాక్షస పాలన సాగించిన టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు దిగజారుడు ఆరోపణలు మానుకుని, సంక్షేమ పాలనలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు.  

గత ప్రభుత్వ నిర్వాకంతోనే గండ్లు : 
అనంతపురం: గత ప్రభుత్వం హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నాసికరంగా చేపట్టడం వల్లే ఈరోజు ఎక్కడికక్కడ గండ్లు పడుతున్నాయని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. గండ్లు పడిన చోట్ల యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేత పనులు చేపట్టి నీటివృధాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చెల్సీ స్థితిగతులపై సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డితో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. లైనింగ్, వెడల్పు పనులు చేపట్టారు కాని, కట్టడాలు నిర్మించకపోవడంతో గండ్లు పడుతున్నాయంటూ అధికారులు వివరించారు. కాంట్రాక్టర్‌కు లాభసాటిగా ఉన్న పనులు సత్వరమే చేపట్టారు తప్ప స్ట్రక్చర్స్‌ నిర్మించలేకపోయారని, ఫలితంగానే గండ్లు పడుతున్నాయని మంత్రి తేల్చి చెప్పారు. కాలువ వెంబడి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు