గొప్ప పాలసీని తీసుకొస్తున్నాం : మంత్రి మేకపాటి

1 Jul, 2020 14:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి చెప్పినట్లుగానే త్వరలో గొప్ప పారిశ్రామిక పాలసీని తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. పాలసీలో చెప్పిన ప్రతి ప్రోత్సాహకాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన సచివాలయంలో వైఎస్సార్‌ నిర్మాణ్‌ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నూతన పారిశ్రామిక పాలసీని సిద్దం చేసి సీఎం జగన్‌కు అందజేశామని చెప్పారు.

సీఎం జగన్‌ చెప్పినట్లుగా గొప్ప పాలసీని రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు పారదర్శకంగా రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కువ ఉపాధి ఇచ్చే పరిశ్రమలకు మంచి రాయితీలు అందిస్తామన్నారు. మూడేళ్ల పాటు నూతన పారిశ్రామిక పాలసీ అమలులో ఉంటుందని, కోవిడ్‌ పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని తెలిపారు. వైఎస్సార్‌ నిర్మాణ్‌ యాప్‌ ద్వారా సిమెంట్‌ను నిర్మాణ సంస్థలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పరిశ్రమల శాఖలో ఐఏసీబీ నిపుణుల సేవలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ భవిష్యత్‌ కార్యాచరణపై నిపుణులతో అధ్యయనం చేయిస్తామని, రాబోయే ఏళ్లలో తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు సలహాలు ఇస్తారని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు