టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోం..

27 Feb, 2020 11:06 IST|Sakshi

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక పాలసీని సిద్ధం చేశామని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో కొత్త పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా తెస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు మంచి పాలసీని రూపొందించారని తెలిపారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకునేది లేదన్నారు. ప్రభుత్వం తమకు సహకరిస్తుందని కియా మోటార్స్‌ చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన వివరించారు.

విశాఖలో 50 వేల ఐటీ ఉద్యోగాలు..
పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్య పరిష్కరించి పెట్టుబడులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఒక్క విశాఖలోనే 50 వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల కోసం అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మూడు పోర్టులను  ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారని వెల్లడించారు. పరిశ్రమలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 75 శాతం స్కిల్‌ మాన్‌పవర్‌ను ఇస్తున్నామని తెలిపారు. సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నామని గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు