గ్యాస్‌ లీక్‌ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి

7 May, 2020 10:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటన సమాచారం అందినే వెటనే అధికార యాంత్రాంగం తక్షణమే స్పందించింది. గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 200 మందికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ప్రమాదంపై సమచారం అందగానే పరిశ్రామల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్‌ఆర్‌ పురం, టైలర్స్‌ కాలనీ, బీసీ కాలనీ, బాపూజీనగర్‌, కంపరపాలెం, కృష్ణానగర్‌ ప్రజలకు సాయంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. (చదవండి : విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

ఇందుకు సంబంధించి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్‌ లీకేజీ అగిపోయిందని.. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. గ్యాస్‌ లీక్‌ వలన ఉన్నపలంగా ఇళ్లను వదిలివచ్చిన ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని మంత్రి గౌతమ్‌రెడ్డి కలెక్టర్‌కు సూచించారు. జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ను మంత్రి ఆదేశించారు. ప్రతి ఒక్కరికి సాయం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు, యువత.. స్థానిక ప్రజలను దూరంగా తరలించడం అభినందనీయం అని చెప్పారు. 

కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు..
గ్యాస్‌ లీక్‌ ఘటనలో కంపెనీ యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్ ఆర్‌.కె.మీనా‌ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే మీనా మాట్లాడుతూ..  స్టేరైన్‌ గ్యాస్‌ లీక్‌ అవ్వడంతో గ్రామాన్ని ఖాళీ చేయించామని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటిని డోర్‌ టు డోర్‌ సర్వే చేస్తున్నామని వెల్లడించారు. గ్యాస్‌ ప్రభావం ఒకటిన్నర కిలోమీటర్ల పరిధి ఉంటుందని.. గ్యాస్‌ ప్రభావాన్ని పూర్తిగా నిరోధించామని తెలిపారు. (చదవండి : ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక గురించి..)

సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.. : కన్నబాబు
విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనపై విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. మరో 2 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని మంత్రి చెప్పారు. పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. అధికార బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు