రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

14 Sep, 2019 05:06 IST|Sakshi
కోర్కెల రొట్టెను పట్టుకుంటున్న హోంమంత్రి సుచరిత, చిత్రంలో మంత్రి అనిల్, ఎమ్మెల్యే రామిరెడ్డి

హోంమంత్రి మేకతోటి సుచరితనేటితో ముగియనున్న రొట్టెల పండుగ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్నదాతలకు సమృద్ధిగా పంటలు పండి అందరికీ మేలు జరగాలని రాష్ట్ర హోం, నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకతోటి సుచరిత ఆకాంక్షించారు. శుక్రవారం ఆమె నెల్లూరులోని బారాషాహిద్‌ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరై రొట్టె పట్టుకున్నారు. హోం మంత్రితోపాటు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. బారాషాహీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్‌ పాలనలో రైతులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టె పట్టుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ..వైఎస్సార్‌ సీపీ 100 రోజుల పాలన బాగా జరిగిందని, రానున్న రోజుల్లోనూ సంక్షేమ సర్కారుగా తాము పనిచేస్తామని తెలిపారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంటలకు నీరు ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం దర్గా ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్‌ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు పాల్గొన్నారు. కాగా శనివారంతో రొట్టెల పండుగ ముగియనుంది. శుక్రవారం కావడంతో దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

మరిన్ని వార్తలు