తప్పును కప్పిపుచ్చుకోవడానికే కులం కార్డు

12 Jun, 2020 14:07 IST|Sakshi

టీడీపీ విష ప్రచారంపై మంత్రులు మండిపాటు

సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనంతా అవినీతిమయంగా సాగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్ధహస్తులు లేరన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్‌ఐలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతున్నారు. అచ్చెంన్నాయుడు అవినీతిని ఆధారాలతో సహా సేకరించిన తర్వాతే ఏసీబీ అధికారులు తమ  విధులు నిర్వహిస్తూ.. చట్ట ప్రకారం వెళ్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు)

వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డును వాడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు. ఇది టీడీపీ నైజమని.. కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారని నిర్ధారణ అయ్యింది కాబట్టే అరెస్ట్‌ చేశారని.. దానికి బీసీ కార్డును వాడాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. మధ్యలో కుల ప్రస్తావన తీసుకురావడం సరైనది కాదన్నారు. ఈ ఒక్క ఘటనతోనే అయిపోలేదని.. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టను బయటకు తీసేందుకు సీబీఐ విచారణ జరిపించాలని నిన్నటి క్యాబినెట్‌లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు.(అచ్చెన్న అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం?)


తప్పుచేశారు కాబట్టే అరెస్ట్‌: అనిల్‌కుమార్‌ యాదవ్‌
అచ్చెన్నాయుడు అవినీతికి, బీసీలకు ఏం సంబంధం అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారనే ఆధారాలతో  ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారన్నారు. అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలను 30 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన ప్రతి పనిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు,లోకేష్‌ అవినీతిపై సీబీఐ విచారణ జరిగితే వారికి శిక్ష తప్పదన్నారు.


తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదు: ఆర్కే రోజా
విజయవాడ: అచ్చెన్నాయుడు అవినీతి ఆధారాలతో దొరికాడు కాబట్టే అరెస్ట్‌ అయ్యారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈఎస్‌ఐలో భారీ స్కాం జరిగిందని విజిలెన్స్‌, ఏసీబీ విచారణలో తేలిందన్నారు. త్వరలోనే చంద్రబాబు,లోకేష్‌ అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుందన్నారు. అడ్డగోలుగా దోచుకున్న తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదన్నారు. తన అవినీతి బయటపడుతుందనే కారణంతో చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వలేదన్నారు. అరెస్ట్‌లు చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా ప్రశ్నించారు.


టీడీపీ నేతలకు భయం పట్టుకుంది..
కర్నూలు: గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారని.. అందుకే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు హయాంలో రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. అవినీతిని బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అచ్చెన్నాయుడు టెలీ సర్వీస్‌, ఆర్‌సీ నాన్‌ ఆర్‌సీ ద్వారా అవినీతికి పాలడ్డారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయనను అరెస్ట్‌ చేశారని జయరాం పేర్కొన్నారు.

చట్టం ముందు అంతా సమానమే: ఇక్బాల్‌
అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను సమర్థిస్తున్నానని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని.. కోట్ల రూపాయల అవినీతి పై విజిలెన్స్ ఆధారాలు సేకరించిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని,  చట్టానికి కులాలు, మతాలతో సంబంధంలేదని చెప్పారు. ఏసీబీ విచారణకు టీడీపీ సహకరించాలని ఇక్బాల్‌ కోరారు.

అచ్చెన్న అరెస్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం
గుంటూరు: అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.10 వేల కోట్లు చొప్పున కేటాయిస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని, మత్స్యకారులను తాట తీస్తామంటూ బీసీలను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని విడదల రజని అన్నారు.

మరిన్ని వార్తలు