గోవుల మృతిపై విచారణ జరిపిస్తాం : మోపిదేవి

10 Aug, 2019 17:32 IST|Sakshi
మంత్రి మోపిదేవి వెంకటరమణ

సాక్షి, విజయవాడ : నగర శివారులోని కొత్తూరుతాడేపల్లి గోశాలలోని గోవుల మృతిపై శాఖపరంగా విచారణ జరిపిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో గోవులు మృతి చెందడం బాధాకరమన్నారు. విచారణ నివేదిక రాగానే గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని గోశాలల్లో ఉన్న గోవుల పరిస్థితిపై తనిఖీలు చేపడతామని చెప్పారు. గోవుల మృతి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా..? అని కూడా విచారిస్తామన్నారు.

గోవుల మృతి బాధాకరం : మల్లాది విష్ణు
గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందటం బాధాకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కొత్తూరుతాడేపల్లి గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గోవుల మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఇక మీదట గోశాలలపై పశుసంవర్ధక శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కాగా విజయవాడ నగర శివారులోని కొత్తూరుతాడేపల్లి గోశాలలో 100 గోవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవుల మరణ మృదంగం కొనసాగుతోంది. గోవుల మృతి సంఖ్య 101కి చేరగా మరో 20 గోవుల పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం గోశాలకు వచ్చిన 22 టన్నుల పసుగ్రాసం మీదే నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  విషపూరితమైన లేత జున్నుగడ్డి తినటం వల్లే ఘోరం జరిగి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మృతి చెందిన పెద్ద గోవులకు పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే గోవుల మృతికి సరైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు