ఇదేంది.. నారాయణ ఇట్లా చేస్తున్నావు..

12 Mar, 2019 10:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి,నెల్లూరు : ఎన్నికలు సమీపించడంతో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమానికి మంత్రి నారాయణ స్వీయ దళంతో తన ప్రయత్నాలు సాగిస్తున్నారు.  ఓటర్‌ వెరిఫికేషన్‌ పేరుతో సిబ్బందిని ఇంటింటికీ పంపి పనిలో పనిగా ఓట్లు లేనివారికి ఓట్లు కల్పిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించేందుకు కుట్రలకు మంత్రి క్యాంపు కార్యాలయం తెరతీసింది. దీనికి నారాయణ విద్యాసంస్థల సిబ్బందితో పాటు అంగన్‌వాడీలను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. మొత్తం మీద నారాయణను గెలిపించటానికి ఆయన సిబ్బందే బోయలుగా మారి పల్లకి మోస్తున్నారు.
 
నగరంలోని అన్ని డివిజన్లలో 20 రోజుల నుంచి నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఇంటింటికి తిరుగుతున్నారు. ఓట్ల వెరిఫికేషన్‌ పేరుతో ఇళ్ల వద్ద హల్‌చల్‌ చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో ఆయన ఉద్యోగులు ఈ వ్యవహారం నడుపుతుండటం స్థానిక అధికార పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. మరో వైపు మంత్రి వ్యవహారం కావడంతో ఎక్కడా ఫిర్యాదులు కూడా రాకుండా ముందస్తుగానే పోలీసు సహకారం అందిస్తున్నారు.

నారాయణ టీమ్‌ తిరిగే ప్రాంతాల్లోని సంబంధిత సీఐలకు ముందస్తుగానే మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి. దీంతో మంత్రి టీమ్‌ ఎండల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తిప్పలు పడుతున్నారు. ఎన్నికల సంఘం జిల్లాలోని నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రకటించింది. 2014 జాబితా కంటే నెల్లూరు నగరంలో ఓట్లు సుమారు 52 వేల పైచిలుకు ఓట్లు తగ్గాయి. గతంలోనే వెరిఫికేషన్‌ పేరుతో భారీగా వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించారు.

మళ్లీ ఓట్ల నమోదు ప్రక్రియలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఓట్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. 2014లో నెల్లూరు నగరంలో 2,44,382 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు భారీగా తగ్గి తాజా జాబితా ప్రకారం నెల్లూరు నగరంలో 1,92,469 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. జిల్లాలో తక్కువ ఓటర్లు, ఎక్కువ జనాభా ఉన్న నగరం కూడా నెల్లూరు కావటం విశేషం. ఈ పరిణమాల క్రమంలో నగరంలో గెలవడానికి అవసరమైన అన్ని అడ్డదారులు తొక్కడమే ధ్యేయంగా మంత్రి నారాయణ పని చేస్తున్నారు.

అందులో భాగంగా నారాయణ విద్యాసంస్థల సిబ్బందిని నగరంలోని డివిజన్లకు ఇన్‌చార్జిగా నియమించారు. వారికి సహాయకులుగా నలుగురుతో కలిసి టీమ్‌ ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా తిప్పుతున్నారు. తరచూ ఏదో ఒక చోట ఇబ్బంది తలెత్తి స్థానికులు ప్రశ్నిస్తే మున్సిపల్‌ ఉద్యోగులం అంటూ అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలాజీనగర్‌లో ఇదే తరహాలో ఓ వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి వెళ్లి వివరాలన్ని అడిగారు.

సదరు నేత వివరాలు చెప్పి మీరు ఎవరని ప్రశ్నిస్తే తాము మున్సిపల్‌ ఉద్యోగుల అంటూ బదులిచ్చారు. మున్సిపల్‌ ఉద్యోగులు ఇప్పుడు చేయడానికి నిబంధనలు అంగీకరించవు కదా అని ప్రశ్నించి ఓట్లు తొలగించమని లేదా ఫారం–7 దరఖాస్తు చేయడానికి వచ్చారా అని ప్రశ్నించటంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నగరంలో అనేక డివిజన్లలో రోజు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.  

మన ఓట్లు కాకపోతే జాగ్రత్తగా చూడండి 
ఇదిలా ఉంటే నారాయణ తన సిబ్బందిని ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఒక టీమ్‌ పర్యవేక్షిస్తుంది. నగరంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల నిర్వాహకుడు, టీడీపీ నేత నేతృత్వంలో ఒక టీమ్‌ ఏర్పాటే చేసి ఓట్లు తొలగింపుకు ఫారం–7 దాఖలు. కొత్త ఓట్ల కోసం ఫారం–6 దరఖాస్తు కార్యక్రమం చేస్తున్నారు. ఎలాగైనా, ఎన్ని అడ్డదారులు అయినా తొక్కి గెలవాలన్నదే క్యాంపు ధ్యేయం అంటూ బహిరంగంగా సదరు నేతలు చెప్పుకుంటున్నారు.
 
‘మా ఉద్యోగాలు కళాశాలలో కానీ, విధులు మాత్రం రోడ్లపై ఒకటి కాదు రెండు కాదు 20 రోజుల నుంచి మండుటెండల్లో మమ్మల్ని ఇంటింటికీ తిçప్పుతున్నారు. ఇంకెన్ని రోజులని అడిగితే మంత్రి నారాయణ కోసం మరో నాలుగు రోజులు పనిచేయండని హుంకరిస్తున్నారు. మావల్ల కాదంటే నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు ఉండవంటున్నారు.’
–  మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఆవేదన  

మరిన్ని వార్తలు