మంత్రి నారాయణ ఒక స్వార్థపరుడు

3 Apr, 2019 11:51 IST|Sakshi

స్వార్థం కోసం బంధువులకూ అన్యాయం చేశాడు

షాడో మంత్రి వల్లే మెడికల్‌ కళాశాల్లో కొందరు విద్యార్థినులు ప్రాణాలు తీసుకున్నారు

ఆయన వల్లే నారాయణకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదు

‘మంత్రి నారాయణ ఒక స్వార్థపరుడు. అతని స్వార్థం కోసం బంధువులను కూడా పావుగా వాడుకున్నాడు. మనిషిని ఎలా వాడుకోవాలో నారాయణకు వెన్నతో పెట్టిన విద్య. అతని వల్ల ఒక్కరు కూడా బాగుపడిన వారు లేరు. నారాయణను నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతాడు. అలాంటి వ్యక్తిని నమ్మి ఓటు వేస్తే ఓటర్లకు చుక్కలు చూపిస్తాడు’ అని నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి నారాయణ గురించి ఆయన తోడల్లుడు బండి రామ్మోహన్‌రెడ్డి ‘సాక్షి’తో  చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. 
 

సాక్షి, నెల్లూరు: నారాయణ మెడికల్‌ కాలేజ్‌లో చాలా మంది అమ్మాయిలు అనుమానాస్పదస్థితిలో చనిపోవడానికి షాడో మంత్రే కారణం. ఈ విషయం నారాయణకు తెలుసో లేదో కానీ షాడో మంత్రి మెడికల్‌ కళాశాల్లో కీలక పదవిలో ఉన్నప్పుడే కొంత మంది అమ్మాయిలు చనిపోయారు. అతని వేధింపుల వల్లే చనిపోయారని అందరికీ తెల్సిందే. షాడో మంత్రి అకృత్యాలు, అన్యాయాలతో ఎంతమంది బలైనారో నాకు తెలుసు. నారాయణ లోగుట్టు షాడో మంత్రికి తెలుసు కాబట్టే అతడ్ని దూరంగా పెట్టడు. షాడో మంత్రి వల్లే నారాయణకు బంధువర్గం దూరమైంది. ఆ షాడో వల్లే మంత్రి నారాయణకు ఓటమి తప్పదు.
40 ఏళ్లలో నారాయణ వల్ల బాగుపడిన వారు ఒక్కరు కూడా లేరు

మంత్రి  నారాయణ స్వార్థపరుడు. 40 ఏళ్ల చరిత్రలో ఒక్కరికి కూడా సాయం చేసిన దాఖలాల్లేవు. రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్న మంత్రికి తన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు చాలా మంది ఉన్నారు. వారిలో  ఇప్పటికీ ఒక్కరికి కూడా  సాయం చేసిన పాపాన పోలేదు. నారాయణ స్నేహితుల్లో చాలామంది పేదవారు ఉన్నారు. అలాంటి వారికి కూడా సాయం చేయని వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించిన వారికి ఏం న్యాయం చేస్తాడు?

నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశానని మంత్రి నారాయణ చెబుతున్న దాంట్లో ఆయన స్వార్థం ఉంది. కేవలం ఎమ్మెల్యేగా పోటిచేసి గెలవాలనీ ఉద్దేశంతో నిధులు తెచ్చావు. నీవు మంత్రిగా పనిచేస్తే జిల్లా అంతా అభివృద్ధి చేయాలి కదా? నెల్లూరు నగరం వరకే ఎందుకు పరిమితం అయ్యావు? నీ సొంత నిధులతో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేశావా? రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నావు. అంత అభివృద్ధి  చేస్తే ఓటుకు రూ.5 వేలు వంతున ఇస్తానని ఎందుకు చెబుతున్నావు. వాస్తవంగా నీవు అభివృద్ధి చేసి ఉంటే నీకు ప్రజలే ఓట్లెయ్యాలి కదా. 

మంత్రి నారాయణ పుట్టుకతో కోటీశ్వరుడు కాదు. కష్టపడి చదువుకున్నాడు. ఆ చదువుతోనే వ్యాపారం చేసి 40 ఏళ్లలో రూ.40 వేల కోట్లు సంపాదించాడు.  విద్య, వైద్యాన్ని అమ్మి ఏడాదికి రూ.1000 కోట్లు సంపాదిస్తాడు. ఇలా సంపాదన రావాలంటే ఎంత దోపిడీ చేయాలి. ఎంతమంది పేదలను పీల్చి పిప్పిచేశాడో నాకు బాగా తెలుసు. 25 ఏళ్లు అతని వెన్నంటే ఉన్నాను. విద్యాసంస్థల్లో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో నాకు తెలుసు. నిజాయితీగా ఎవరైనా రూ.వేలకోట్లు సంపాదిస్తారా? ఎన్నో అక్రమాలు చేశాడు కాబట్టే అన్ని వేల కోట్లు సంపాదించాడు.

మరిన్ని వార్తలు