మాటలు వద్దు... పనిచేయండి

13 May, 2016 03:31 IST|Sakshi
మాటలు వద్దు... పనిచేయండి

శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డికి మంత్రి నారాయణ చురకలు
చిత్తూరు కార్పొరేషన్
కమిషనర్‌పై మంత్రికి ఎమ్మెల్యే సత్యప్రభ ఫిర్యాదు
తిరుపతిలో మున్సిపల్
కమిషనర్లు, కౌన్సిల్ చైర్మన్లతో సమీక్ష

 
 
తిరుపతి కార్పొరేషన్ : ‘అభివృద్ధిలో శ్రీకాళహస్తి వెనుకబడినా పట్టించుకోరు.. మేము నిధులు ఇస్తామన్నా తీసుకుని ఖర్చు చేసేందుకు ముందుకురారు.. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే మాత్రం బ్రహ్మాండంగా స్పీచ్‌లు ఇస్తారు.. పనులు మాత్రం చేయరు.. మాటలతో పనులు కావు.. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేలా కౌన్సిల్ ద్వారా చొరవ చూపండి’ అంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డికి చురకలు అంటించారు. సాక్షాత్తు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన రాధారెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మంత్రి వ్యాఖ్యలతో పక్కనే ఉన్న మంత్రి బొజ్జల ఒకింత ఇబ్బందికి గురికావాల్సి వచ్చింది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లు, చైర్మన్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.


 తాగునీటికి నిధులు కేటాయింపు..
 జిల్లాలోని అన్ని మున్సిపల్, కార్పొరేషన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌తో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేదని, మిగిలిన వాటికి నిధులు ఇస్తున్నామని, శాశ్వత మంచినీటి సదుపాయాన్ని కల్పిం చాలని ఆదేశించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఆఖరుకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. 150 రోజుల్లో జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ చేయించాలన్నారు.


 చిత్తూరు కమిషనర్ తీరు బాగలేదు..
 నగరంలో ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. అదనంగా ఐదు మంచినీటి సరఫరా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తే కమిషనర్ తిరిగి పంపించేశారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా మంత్రి స్పందించకపోవడంతో ఆమె సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య, తిరుపతి కార్పొరేషన్ వినయ్‌చంద్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు