‘అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని తొలగిస్తాం’

18 Nov, 2017 09:47 IST|Sakshi
ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్టపై నిర్మించిన నివాసంలో చంద్రబాబు

సాక్షి, అమరావతి: పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో  ఆయన నిన్న (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.

జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు కదా, ప్రస్తుతమున్న నిర్మాణాల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బదులిస్తూ నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనన్నారు. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం శుభపరిణామమన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతూ రాజధాని నిర్మాణం చేపడతామని ఒక సవివర నివేదిక(డీపీఆర్‌)ను సంబంధిత మంత్రిత్వశాఖకు ఇచ్చిందని, దాన్ని తూచా తప్పక పాటించాలని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసిందని తెలిపారు.

1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్‌ కంపెనీలకిస్తాం..: రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుపై సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో చర్చించామని చెప్పారు. సింగపూర్‌ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాలని, ఈ చిక్కుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్‌ కంపెనీలకు ఇస్తామని, వారు లేఅవుట్లు వేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వాటిని విక్రయిస్తాయన్నారు.  

మరిన్ని వార్తలు