పరిశ్రమల పునరుజ్జీవం కోసమే రీస్టార్ట్‌

30 Jun, 2020 08:53 IST|Sakshi
తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్రంలో ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్‌ భరత్‌గుప్త తదితరులు

రెండు విడతల్లో 1,798 పరిశ్రమలకు రూ.117.87కోట్లు కేటాయింపు 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు

లాంఛనంగా రెండో విడత రీస్టార్ట్‌ ప్యాకేజ్‌ ప్రారంభం 

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: కష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక రంగాన్ని పునర్‌ నిర్మించేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజ్‌ దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన రూ.827కోట్ల ప్రోత్సాహక బకాయిలతో పాటు కొత్తగా రూ.1,168కోట్ల రీస్టార్ట్‌ ప్యాకేజ్‌ని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా రూ.512.35కోట్లు సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బటన్‌ నొక్కి ప్రారంభించారు.

తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి  ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ     యండపల్లి శ్రీనివాసులురెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే  బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త, జీఎండీ ప్రతాప్‌రెడ్డితో కలసి ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూతపడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే విడతలవారీగా నిధులు విడుదల చేస్తోందని తెలిపా రు. గత ప్రభుత్వంలో ఈ తరహా పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. జిల్లా వ్యాప్తంగా రీస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా మొదటి విడతలో 944 ఎంఎస్‌ఎంఈలకు రూ.68 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడతలో 854 ఎంఎస్‌ఎంఈలకు రూ.49.87 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇంత మొత్తంలో సాయం చేసిన సీఎంకు రాష్ట్ర వ్యాప్తంగా పారి శ్రామికవేత్తలు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయమన్నారు. 

మూతపడిన పరిశ్రమలను ఆదుకున్నారు 
మూతపడిన పరిశ్రమలను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు ముఖ్యమంత్రి సాయం అందించారు. పరిశ్రమలకు కార్పస్‌ ఫండ్, మార్కెట్‌ సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రాణం పోశారు. మేము 2018లో పరిశ్రమలు స్థాపించేటప్పుడు వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం ఇబ్బందులుపడ్డాం. ఇప్పుడు కరోనాతో సంక్షోభంలో పడ్డాం. దేవుడిలా ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. 
–  సురేష్, చక్రి ఇండస్ట్రీస్‌ అధినేత, పెనుమూరు

ఆక్సిజన్‌ ఇచ్చారు 
ప్రస్తుతం పరిశ్రమలు దివాలా తీసే పరిస్థితి.  గత ప్రభుత్వ బకాయిలను కూడా ప్రస్తుతం విడుదల చేయడం వల్ల ఆక్సిజన్‌ ఇచ్చినట్లు ఉంది. మా గ్రానైట్‌ పరిశ్రమపరంగా పెట్టుబడి, విద్యుత్, అమ్మకపు పన్నులు, వడ్డీ అన్ని కలిపి పెండింగ్‌ ఉన్న రూ.30 లక్షలు విడుదలైంది. 
– జె.రాధిక, గ్రానైట్‌ పరిశ్రమ యజమాని గంగాధరనెల్లూరు  

మరిన్ని వార్తలు