రెవెన్యూ ప్రక్షాళన తప్పనిసరి

17 Aug, 2019 10:34 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

 గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఆక్రమణలను తొలగించండి 

నిబంధనలకు విరుద్ధంగా చెక్‌డ్యాంల నిర్మాణం 

సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి

సాక్షి, చిత్తూరు: రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేయకపోతే లాభం లేదని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా, జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎస్‌.ఆర్‌.పురంలో ఐదేళ్లలో 32 చెక్‌డ్యాంలకు దాదాపు రూ.4 కోట్లు వెచ్చించి నిబంధనలను పాటించకుండా నిర్మించారని చెప్పారు. ఆ అవినీతి నిర్మాణాల బిల్లులను పెండింగ్‌లో పెట్టి, విచారణ చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. మరికొన్ని చోట్ల పనులు చేయకుండానే బిల్లులు పొందారని, వాటికి అధికారులు ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు.

వెదురుకుప్పం మండలంలో అధికంగా నకిలీ పాస్‌పుస్తకాలు పొందారన్నారు. అటువంటి వాటిని విచారించి రద్దు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇళ్లు లేని ప్రజలందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువైన భూమిని గుర్తించాలని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. పాలసముద్రం, ఎస్‌ఆర్‌.పురం, గంగాధరనెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమణలకు పాల్ప డిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తహసీల్దార్లపై ఆగ్రహం 
భూ ఆక్రమణలను తొలగించాలని చెప్పినప్పటికి జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని తహసీల్దార్లు అలసత్వం వహిస్తుండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌.ఆర్‌.పురంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ గ్యాస్‌ ఏజెన్సీ గోడైన్‌పై చర్యలు చేపట్టాలని ఆదేశిస్తే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. నాయకులు ఎవ్వరూ చెప్పినా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వకూడదన్నారు. ఆ గ్యాస్‌ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, తహసీల్దార్‌ను ఆదేశించారు. భూ ఆక్రమణల తొలగింపు విషయంలో తహసీల్దార్లు చర్యలు తీసుకోకుండా నోటీసులు జారీ చేసి మిన్నకుండడం దారుణమన్నారు. అలాంటి పద్ధతిని మానుకుని పారదర్శకంగా విధులు నిర్వహించాలని చెప్పారు.

నెలవాయిలో ఒక టీచర్‌ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే ఎందుకు చర్యలు చేపట్టలేదని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. కబ్జా భూములను వెనక్కు తీసుకుంటే ఎంతో మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వవచ్చని చెప్పారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని 32 చెరువులను వెంటనే అనుసంధానం చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా మాట్లాడుతూ గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని తహసీల్దార్లు భూఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడానికి 1000 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు