ఈ పరిస్థితుల్లోనూ రేటింగ్‌ల కోసం ప్రయత్నాలా?

27 Mar, 2020 14:24 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ‘‘కొన్ని మీడియాలు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రేటింగ్‌ల కోసం ప్రయత్నిస్తారా? సమాజహితం అవసరం లేదా?’  అని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల వద్ద జరిగిన సంఘటనలను కొన్ని మీడియాలు తప్పుగా చిత్రీకరించిన తీరును ఆయన తప్పుబట్టారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  క్వారంటైన్‌ చేయకుండా రాష్ట్రంలోకి ఎలా అనుమతిస్తామని అన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని హెచ్చరించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నిరాశ్రయులందరినీ కల్యాణమండపాల్లో ఉంచాలని ఆదేశించామన్నారు. దాతలు అధికారుల ద్వారా సాయం అందించవచ్చని కోరారు. భోజనాలకు ఇబ్బందిపడేవారికి వాలంటీర్ల ద్వారా సాయం అందిస్తామని తెలిపారు. 

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ మూడు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కరోనా దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  సుమారు 28వేల మంది విదేశీయులు, ఎన్నారైలను గుర్తించాం. కరోనా వైరస్‌  నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు చేశాం.  జిల్లాస్థాయిలో కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ఏప్రిల్‌ 14 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగిస్తాం. 52వేల ఎన్‌-95 మాస్క్‌లను అందుబాటులోకి తెచ్చాం. వైద్యుల కోసం ప్రత్యేక బాడీ మాస్క్‌లను 4వేలకుపైగా సిద్దం చేశాం. జిల్లా, నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేసిన ఆస్పత్రులకు కూడా అన్ని వసతులు సమకూర్చాం.  ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలి.. సామాజిక దూరం పాటించాలి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. 

ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.2కోట్ల అత్యవసర నిధి.  ఆక్వా ఎగుమతిదారులతో మంత్రి మోపిదేవి శనివారం సమావేశమవుతారు. పొలం పనులకు వెళ్లేవారు కూడా సామాజిక దూరం పాటించాలి. ఐదుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్‌లు.. నలుగురు సీఎంవో సిబ్బందితో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు. జిల్లా, నియోజకవర్గస్థాయిల్లో కూడా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్ల ద్వారా గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనవాళ్లను తీసుకురాలేకపోవడం బాధాకరం. కరోనాలాంటి మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్మ మనవాళ్లందరూ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి. 14 నుంచి 28 రోజులపాటు వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం లేని పరిస్థితి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం.. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి. ( స్వీయ నిర్బంధమే కరోనాకు మందు )

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సీఎం జగన్‌ మాట్లాడి హామీ తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలతో కూడా సీఎం జగన్‌ మాట్లాడుతున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవాళ్లు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధమైతే.. వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ గురించి ఏం తెలుసు?. మార్చి 10న వాలంటీర్లతో జరిపిన సర్వేలో 15వేలు మంది ఉన్నారని తెలిసింది. రెండోసారి జరిగిన సర్వేలో 28వేలుగా గుర్తించాం. లాక్‌డౌన్‌ చేయబోతున్నారన్న పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న వ్యక్తులంతా రాష్ట్రానికి వచ్చారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు. సరిహద్దుల వద్ద ఆందోళన చెందుతున్న ప్రజల విషయంలో కూడా బాబు రాజకీయాలకు వాడుకుంటున్నార’ని మండిపడ్డారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా