భావోద్వేగానికి లోనైన మంత్రి పేర్ని నాని

29 Jun, 2020 17:11 IST|Sakshi

సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. భాస్కర్‌రావు మృతదేహాన్ని చూసిన మంత్రి పేర్ని నాని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనకు నివాళులర్పిస్తున్న సమయంలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం హత్యకు గురైన భాస్కర్‌రావు కుటుంబాన్ని మంత్రి ఓదార్చారు. కాగా, మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కర్‌రావును దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. 

దుండగులు పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌ రావును హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ఇద్దరూ టీడీపీ మాజీ కౌన్సిలర్‌ అనుచరులుగా అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(చదవండి : వైఎస్సార్‌ సీపీ నేత దారుణ హత్య)

మచిలీపట్నం ఆస్పత్రి వద్ద హైటెన్షన్‌..
భాస్కర్‌రావు హత్యకు గరయ్యాడనే విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌రావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆస్పత్రి వద్ద భారీగా బలగాలను మోహరించారు. దీంతో ఆస్పత్రి వద్ద హైటెన్షన్‌ నెలకొంది. మరోవైపు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా