‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

21 Jul, 2019 15:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : రవాణాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎవరికైనా అర్హత ఉండి అన్యాయం జరిగితే నేరుగా తనను కలవొచ్చని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇకపై నెలలో ఓ శుక్రవారం రవాణా ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వ్యవస్థల్లో అవినీతిపరులు ఉన్నారని, అంతమాత్రాన వ్యవస్థ మొత్తానికి అవినీతిని ఆపాదించడం సరికాదన్నారు.  ఏపీలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు.

గతంలో పోలిస్తే ఆటో ప్రమాదాల సంఖ్య కొంతవరకు తగ్గాయని తెలిపారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, మరణాలు బాగా పెరిగాయన్నారు. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు వాహనాలు తోలుతూ.. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామని, దీనిపై అధికారుల్లో ప్రజల్లో అవగాహనా కల్పించాలని, జాతీయ రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ ను విస్తృతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేశామని, రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.

మరిన్ని వార్తలు