ఏకపక్షం..!

20 Nov, 2015 00:29 IST|Sakshi

విధివిధానాలకు భిన్నంగా జెడ్పీ సమావేశం
 బాపట్లలో క్యాంటిన్ విషయంలో
వ్యక్తిగత విమర్శలకుదిగిన ఎమ్మెల్సీ అన్నెం
 విమర్శలకు గురైన మంత్రి ప్రత్తిపాటి నిర్ణయాలు
నిబంధనలకు విరుద్ధంగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మోదుగుల
ప్రజా సమస్యలు పక్కన పెట్టి జాతీయ క్రికెట్  ఎంపిక సంఘం సభ్యుడు ప్రసాద్‌కు సన్మానం చేయడంపై అభ్యంతరాలు

 
గుంటూరు : విధి విధానాలకు భిన్నంగా గురువారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం జరగడం సర్వత్రా విమర్శలకు దారితీసింది.  తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రీతిలో పాలకులు వ్యవహరించగా,అధికారులు అందుకు అనుగుణంగా వంతపాడడం సభికు లను ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాపరిషత్ సభ్యుడు కాని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరుకావడం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. సభ్యులకు ముందస్తు సమాచారం ఏమీ లేకుండా జాతీయ క్రికెట్ ఎంపిక సంఘం సభ్యుడు ఎం.ఎస్.కె. ప్రసాద్‌కు సన్మానం చేయడం విమర్శలకు దారి తీసింది.

 విమర్శలకు గురైన మంత్రి ప్రత్తిపాటి ఆదేశాలు..
 అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక తవ్వకాలు, సివిల్ సెటిల్‌మెంట్లు, వ్యవసాయ పరికరాల సరఫరా, అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాపట్ల ఆస్పత్రిలో క్యాంటిన్ నిర్వహణపై వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసి విమర్శలకు గురయ్యారు. అక్కడి రోగుల సౌకర్యార్థం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలను ఒక వ్యక్తికి అప్పగించారు. సొంత నిధులు ఖర్చు చేస్తూ రోగుల మన్ననలు పొందుతున్నారు.  ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ ఆ క్యాంటిన్‌ను ఒక రెస్టారెంట్‌గా సమావేశంలో అభివర్ణించడమే కాకుండా ఆస్పత్రి ఆవరణను వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారని వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఎమ్మెల్యే సమావేశంలో లేని సమయంలో సతీష్ చేసిన ఆరోపణలపై నిర్ధారణకు రాకుండా మంత్రి ప్రత్తిపాటి విచారణకు ఆదేశాలు జారీచేశారు. కొంపలు ముంచుకుపోయే సమస్యలపైనే సావధానంగా స్పందించే ప్రత్తిపాటి ఈ చిన్న సమస్యపై వెంటనే స్పందించడం వెనుక ముందస్తు వ్యూహం ఉందనే అభిప్రాయం లేకపోలేదు.

 నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే మోదుగుల హాజరు..
 ప్రజా సమస్యల పరిష్కారానికి రెండు మూడు నెలలకు ఒకసారి ఏర్పాటవుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలి. అయితే నగరపాలక సంస్థల పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ఈ సమావేశాలకు హాజరు కాకూడనే నిబంధన లేకపోలేదు. అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి గురువారం నాటి సమావేశానికి హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా హజరైనా అధికారులెవరూ ప్రశ్నించిన దాఖలాలు లేవు.
 
సమస్యలను పక్కనపెట్టి సన్మానం...

 ఇక సమావేశంలో ఏడు ప్రధాన శాఖలపై సమీక్షించేందుకు అజెండాలో ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యవసాయం, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖలపైనే సమీక్షించారు. మూడో శాఖపై సమీక్ష జరుగుతున్న క్రమంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు ఇటీవల జాతీయ క్రికెట్ ఎంపిక సంఘానికి సభ్యుడైన ప్రసాద్‌ను సమావేశపు హాలుకు తీసుకువచ్చారు. వేదికపైనే జిల్లా కలెక్టర్, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుల పక్కన కూర్చోబెట్టి ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమం పట్ల జిల్లా పరిషత్ సభ్యులెవరూ తప్పు పట్టకపోయినా, జరిగిన విధానాన్ని వ్యతిరేకించారు. జాతీయ స్థాయిలో ఎంపికైన ప్రసాద్‌ను ఘనంగా సన్మానించాల్సిన బాధ్యత జిల్లా ప్రజలందరికీ ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై సమావేశంలో చర్చించాల్సి ఉంటే, వాటిని పక్కన పెట్టి సన్మానించడం సరైన చర్యకాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి కూడా ప్రసాద్‌ను సన్మానించే విషయంలో నిబంధనలను పరిశీలించకపోవడం విమర్శలకు దారి తీసింది.
 
సమావేశాన్ని తప్పుదారి పట్టించే రీతిలో ఎమ్మెల్సీ అన్నం....

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి హాజరుకాని నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ సమావేశాన్ని తప్పుదారి పట్టించేరీతిలో వ్యవహరిస్తే, దానిపై పరిశీలన చేయకుండా మంత్రి వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సతీష్ పేర్కొన్న రీతిలో అక్కడి పరిస్థితులు లేవని, రోగులకు సౌకర్యాలు కల్పించేందుకు కోన రఘుపతి చిన్నపాటి క్యాంటిన్‌ను అక్కడ ఏర్పాటు చేసి ఓ వ్యక్తికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.  నెలకు రూ.15 వేలు అద్దె చెల్లించే విధంగా ఆస్పత్రి సలహా సంఘ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే, టెండరు లేకుండా భారీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడానికి కోన రఘుపతి అక్కడ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. టెండరు లేకుండా క్యాంటిన్ అప్పగించడం పట్ల సతీష్ చేసిన విమర్శపై ఒకసారి టీడీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలనే అభిప్రాయం వినపడుతోంది.  వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను కాపాడేందుకు రెయిన్‌గన్లు సరఫరా చేసేందుకు మంత్రి ప్రత్తిపాటి టెండర్లు లేకుండా రూ.8 కోట్ల విలువైన పరికరాలను రెండు సంస్థలకు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ఒకసారి టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.
 
 
 

మరిన్ని వార్తలు