మంత్రులను నిలదీసిన రైతులు

27 Oct, 2013 01:11 IST|Sakshi

సాక్షి, బాపట్ల: భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో ముంపునకు గురైన పంట పొలాలను, ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులుబాధిత రైతుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదుర్కొన్నారు. మంత్రులను ముంపునకు గురైన పంట పొలాలవైపు నడిపించిన రైతులు ‘చూసి వెళ్లడమేనా, మా కష్టాలు తీర్చేది ఉందా’ అంటూ నిలదీశారు. గతంలో ప్రకటించిన నష్ట పరిహారం ఏదీ? అని ప్రశ్నించారు. జలమయమైన కాలనీలు, ముంపు బారినపడిన పొలాలు పరిశీ లించేందుకు గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ వెంకటేశ్, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు కాసు వెంకటకృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి శనివారం బాపట్ల వచ్చారు. వారు జిల్లెళ్లమూడి వెళ్తున్న విషయం తెలుసుకున్న జమ్ములపాలెం గ్రామస్తులు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావాలని పట్టుపట్టారు.
 
 

రఘువీరారెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి మాత్రమే కార్లు దిగి పదండి వెళ్దాం అంటూ రైతులతో కలిసి బయలుదేరారు. ముంపునకు గురైన పొలాలను చూసి వెనుదిరుగుతున్న మంత్రులను రైతులు నిలదీశారు. ‘వచ్చి చూసి వెళ్లడం కాదండీ.. మా సంగతేందో తేల్చిచెప్పండి. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పొలాలన్నీ ముని గిపోయి సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలీక మా ఊళ్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు చూసి వెళ్లడమే కానీ, తర్వాత కనిపించరు’ అం టూ మండిపడ్డారు. సమ్మెల కారణంగా నీలం తుపాను బాధితులకు పరిహారం అందజేయలేకపోయామని, త్వరలోనే అందజేస్తామని రఘువీరా చెప్పారు.
 

మరిన్ని వార్తలు