అర్హులందరికీ నవరత్నాలు

23 Jun, 2019 08:06 IST|Sakshi
కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, చిత్రంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జేసీ డిల్లీరావు

అవినీతి రహిత, సంక్షేమ పాలన సీఎం ధ్యేయం

అందరం సమష్టిగా పనిచేద్దాం 

అధికారులతో సమీక్షలో మంత్రి ఎం.శంకరనారాయణ

సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని, అర్హులందరికీ నవరత్నాలను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. శనివారం ఆయన జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సాక్షి, అనంతపురం అర్బన్‌: ‘జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. సుపరిపాలన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయం. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకెళుతోంది. ‘నవరత్నాల’ ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిద్దాం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఐదేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, కరువుతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
 
జిల్లా రైతులకు రూ.1,007 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 
ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు 2014 నుంచి వారికి రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు తొలి కేబినెట్‌లోనే ఆమోదం తెలిపారన్నారు. ఇందులో జిల్లా రైతులకు రూ.1,007 కోట్లు అందనుందని తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా పేద రైతులకు పెట్టుబడికి ఏటా రూ.12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో పకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు.

ప్రతి పేదవానికి ఇల్లు, వృద్ధులకు దశలవారీగా పింఛన్‌ రూ.3 వేలకు పెంపు, పింఛన్‌ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, నిత్యావసరాలను ఇంటికే చేర్చడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ (మధ్యంతర భృతి), సీపీఎస్‌ రద్దు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనం, రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తొలి కేబినెట్‌ సమావేశంలో తీసుకున్నారని గుర్తు చేశారు.   తాగునీరు, వ్యవసాయం, విత్తన పంపిణీ, ఉద్యన పంటలు, తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్,  ఎమ్మెలేలు వై.వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జేసీ ఎస్‌.డిల్లీరావు, జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

ఉరవకొండలో నీటి ఎద్దడి
ఉరవకొండ పట్టణంలో తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు. నిర్వహణ లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి. పంటల బీమాలో మార్పు తేవాలి. వాతావరణ బీమా వల్ల రైతుకు ప్రయోజనం కలగడం లేదు. గ్రామం యూనిట్‌గా బీమా వర్తించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి.  – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే 

ఎస్‌కేయూలో నీటి ఎద్దడి పరిష్కరించాలి
శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి. నగర పాలక సంస్థలో ఉపాధ్యాయులకు సంబంధించి రూ.36 లక్షలు దుర్వినియోగమయ్యాయి. విచారణ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు కొన్ని పాఠశాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి.       – కత్తినరసింహారెడ్డి, ఎమ్మెల్సీ  

రిజర్వాయర్‌తో శాశ్వత పరిష్కారం 
నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్‌ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జీడిపల్లి, పీఏబీఆర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా ఆత్మకూరు మండల కేంద్రానికి నీటిని ఇవ్వవచ్చు. పీఏబీఆర్‌ పైన్‌లైన్‌ ద్వారా కక్కలపల్లి, నారాయణపురం, రాజీవ్‌కాలనీ, ఇలా మరికొన్ని పంచాయతీలకు నీటిని ఇవ్వడం ద్వారా ఎద్దడి నివారించవచ్చు.
– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే 

జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి 
జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. ప్రత్యేకంగా బెంగుళూరు, తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలను ఒక చోటకు చేర్చి సదస్సు నిర్వహించాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లలో డెడ్‌ స్టోరేజ్‌ ఉండేలా చూడాలి. ఇందుకు స్లూయిజ్‌ గేట్‌లు ఏర్పాటు చేయాలి. 
– దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే 

జేసీ నాగిరెడ్డి పథకం పూర్తి చేయాలి 
తాడిపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పెన్నా, చిత్రావతిలో ఇసుక తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇసుకు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జేసీ నాగిరెడ్డి పథకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి.    – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే 

తాగునీటి ఎద్దడి అధికం 
మా నియోజకర్గలోని 120 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు ఇవ్వకుండా తుమ్మలూరుకు తీసుకెళ్లడం ఏమిటి. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలి. రోడ్డు విస్తరణలో భాగంగా బాలికల పాఠశాల కూల్చేశారు. 
– డాక్టర్‌ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే 

నీటి సమస్య తీవ్రంగా ఉంది 
మా నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సత్యసాయి పైప్‌లైన్‌–2 ద్వారా నీటిని అందించాలి. సీపీడబ్లూ స్కీమ్‌ ద్వారా ట్యాంక్‌లు నింపాలి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో తక్షణం నీరు సరఫరా చేయాలి. తీవ్ర వర్షాభావంతో  మామిడి చెట్లు ఎండిపోతున్నాయి.    – డాక్టర్‌ సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే

శాశ్వత చర్యలు చేపట్టాలి 
జిల్లావ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. శింగనమల చెరువు చాలా పెద్దది. పైనున్న వారు నీటిని తమ ప్రాంతాలకు మళ్లిస్తుండడంతో  ఈ చెరువుకు నీరు రావడం లేదు. ఈసారి తప్పకుండా చెరువు నింపాలి.  బీసీ హాస్టల్‌ నిర్మాణాన్ని  త్వరితగతిన పూర్తి చేయాలి.              – శమంతకమణి, ఎమ్మెల్సీ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా