రైతులా మాట్లాడు.. రెబల్‌లా కాదు

3 Nov, 2017 03:00 IST|Sakshi

సమస్య చెప్పిన రైతుపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి అసహనం

ఈ నెల 15 నుంచి విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు

సాక్షి, అమరావతి/ప్రత్తిపాడు: ‘రైతులా మాట్లాడు.. రెబల్‌లా కాదు’.. సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ రైతుతో అన్న మాటలివి. మంత్రితో సమస్యలు చెప్పుకోవడమే ఆ రైతు చేసిన పాపం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గురువారం మంత్రి సోమిరెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్‌తో కలిసి పత్తి పొలాలను పరిశీలించారు. చివరి భూములకు నీరు రాక పొలాలు ఎండుతున్నాయని, గులాబీ రంగు పురుగులు పంటను నాశనం చేస్తున్నా అవగాహన కల్పించే వారే కరువయ్యారని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ విత్తనాలతో నిలువునా మోసపోయామని, గుడ్డి పత్తికి కనీస ధర కల్పించాలని విన్నవించారు. కొనుగోలు కేంద్రాలను గుంటూరు, పర్చూరులో కాకుండా ప్రత్తిపాడులో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలో మంత్రి సోమిరెడ్డి కలగజేసుకుని ‘ముందు ఒక రైతులాగా మాట్లాడు.. రెబల్‌లా కాదు’ అంటూ సమస్యలు వివరిస్తున్న రైతుపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

పత్తి పొలానికి పచ్చ కార్పెట్‌..
కాగా మంత్రి రాక సందర్భంగా వ్యవసాయ అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. మట్టిపై నడుచుకుంటూ పొలంలోకి వెళ్తే మంత్రి కాళ్లు కమిలిపోతాయనుకున్నారో, మట్టి అంటుకుంటుందనుకున్నారో.. రోడ్డుపై నుంచి పత్తి చేను లోపల వరకు కార్పెట్‌ పరచగా దీనిపైనే మంత్రి నడుచుకుంటూ వెళ్లారు.

లంచాలు ఇస్తే ఏవైనా కొనేస్తారా?
వేరుశనగ, శనగ విత్తనాల పుచ్చులపై మంత్రి సోమిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు ఇస్తే ఏవైనా కొనేస్తారా? అని ప్రశ్నించారు. ’లక్ష క్వింటాళ్ల విత్తనాలు పుచ్చిపోతున్నాయ్‌!’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించి అధికారుల వివరణ కోరారు. ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి సచివాలయంలో తెలిపారు.

మరిన్ని వార్తలు